Thursday, 30 October 2014

నింగీ నేలా నీదే .

నింగీ నేలా నీదే .
*************
అంతులేని అంతః శక్తి నీది
అదుపులేని ఆత్మ నిగ్రహం నీది.
అందమైన విగ్రహం నీది
ఆత్మీయాగ్రహం నీది.
అమ్మంటి అనుగ్రహం నీది.
సాగరాన్ని మించిన అనురాగం నీది. ఆకసమంటిన ఆత్మవిశ్వాసం నీది.
పంచభూతాలు నింపుకున్న
పరాశక్తివి నీవు.
ప్రెమనిధివి నీవు.
మమతల పెన్నిధివి నీవు.
జగతికి గతివి నీవు.
ప్రగతికి పరమావధివి నీవు.
నింగీ నేలా నీదే.
జవమూ జీవమూ నీదే.
ఉవ్వెత్తున ఎగిసిపో.
నీ ఉనికి నీడన
ఉజ్వల లోకాన్ని అల్లుకో.

Tuesday, 28 October 2014

అంతర్ముఖం

ప్రతి ముఖాన దాగి మరోముఖం
అస్తిత్వాన్ని సవాల్ చేస్తూనే ఉంటుంది
అంతర్మధనం కదనం చేస్తూ
కవాతు చేస్తూనే ఉంటుంది
పరుగులబడి బాహ్యరూపం
అరువు పరువుకై అర్రులు చాస్తూ
అలమటిస్తూనే ఉంటుంది
అంతులేని అంతర్యుద్ధమిది.
మరో మలుపుకై అలుపులేని
మనో కలుపుతీత ఇది. 

Saturday, 25 October 2014

స్థిత ప్రజ్ఞత

దేహం అశాశ్వతమే.
స్తిత్వానికి అదృశ్య ఊహలకీ
ఆశలకీ దృశ్య రూపమున్నందుకే
ఇన్ని ఉపసద్రుశ్యాలూఉపస్తితులూ.
నిరాశా నిస్పృహల
సశేష అవశేషాలనుండి
తిరిగి కోలుకుని కోల్పోయిన
క్షణాల కాలాన్ని
జీవితాంతం అనిపించేలా
పునః ప్రతిష్టించడం.
అతిధే అయినా అణువణువూ తనువణువూ తనదై
కాలాన్ని కొలిచే ప్రామాణికం.
దేహసందేహాలన్నీ సందేశాలే.
కొలువైన జీవాన్నీ సెలవంటూ
సేద తీరే వేళ,
మౌన సాక్షిగా నిలిచే స్థిత ప్రాజ్ఞ్యి దేహం.

మంచిరోజు

మంచి రోజు ఏ ఆకాశాన్నుంచో ఊడిపడదుగా
ఎదురు చూడ్డానికి .....,!!!
పితృస్వామ్య వ్యవస్థ మనది....
మగవాడికి ఆడదాని అవసరం అడుగడుగునా ఉన్నప్పటికీ సంపాదిస్తున్నామనే అహం, పోషిస్తున్నామనే అధికారం, ,వాటికి తోడు అనాదిగా కొనసాగుతున్న ఆచారాలూ, పురుషుని వైపే మొగ్గు చూపేవిగా ఉండడంతో,
మళ్ళీ బలయ్యేది ఆడదే .,,,,,,,
సహనాన్ని బలహీనతగా చూసే సమాజం,
దాన్నే ఆడదానికుండాల్సిన లక్షణమని తేల్చి పారేసింది. .ఆడది తనకు తాను అణచివేతను
ఆహ్వానించేలా చేసిందీ సమాజమే .చివరకెటోచ్చీ
ఆడది అనే పదార్ధం ఆధారపడి బ్రతకడానికే అన్నట్లుగా ,ఆడపిల్ల పుడితే పురిట్లోనే పూడ్చేలా
తయారయిందీ సమాజం ......
ఎప్పుడయితే ఆడది ఆధారపడి బ్రతికే స్థాయి నుండి
ఆర్ధిక ,విద్యా ఉద్యోగ స్వావలంబన పొంది..... మానసికంగానే కాకుండా భౌతికంగానూ శక్తినొందితే. త్వరలో కాకున్నా తెరలు తెరలుగానైనా...
ఈ ఆచారాల అణచివేతల నుండి విముక్తి పొందొచ్చు. .ఆరోజు కోసం ఎదురు చూడడం కాదు..
అలాటి రోజును  నిర్మించడానికి ......
ఈరోజే పునాది వెయ్యాలి .....
అమ్మ గురించి గొప్పలు చెప్పి చెప్పి.......
గొప్పలు పోవడం కాదు .....
ఆడతనం లేనిదే అమ్మతనం రాదు....
ఆడదాన్ని గౌరవిస్తే అమ్మనీ గౌరవించినట్లే....

దీవించే జీవులు

పుట్టి పెరిగే  మొదలు చదివిఎదిగేదాక కన్నవారు కాయాన్ని
కష్టాలు పాల్జేసి చేతికందొస్తాడని చిల్లిగవ్వను దాచక పస్తులుండి
తల్లి  పుస్తెలమ్మి ..
బస్తీ నుండి వచ్చి దర్జాగ కారులో వొదిలేస్తే మమ్మల్ని వోల్డేజి హోములో .
చేతులేన్నడూ దీవించేవే కాని
గోరంత కోపాన్ని చూపవేనాడూ .
కనుచూపు మేర కనిపించునత
కన్న కొడుకుని చూసి కళ్ళ నిండా .
చల్లంగ ఉండాలి కొడుకా నువ్వు
మెల్లంగ వెళ్లురా కొడుకా .



స్నేహస్తాలు

అరమరికల్లేని హృదయాల అమరిక,
హద్దూ అదుపూ లేని అలల వీచిక,
స్నేహాల లయల ఊయల డోలలో
ఊగెనే జగమంత ఉల్లాస హేలలో,
నీదీ నాదీయనే నియమమే లేనిదీ,
మనదే మనమే అనే మమతే ఉన్నదీ, తోడబుట్టిన వారి తోడూ కరవైనా,
చెలిమి చేసిన చేయి వీడదెపుడైనా
అందుకే ఓ నేస్తం,
అందుకో స్నేహహస్తం.
స్నేహమయమే జగం సమస్తం .

నిప్పు పిడికిళి

ఉడుకెత్తిన ఉక్కుపిడికిళ్ల
మెరుపు రవ్వలనాపేదెవ్వరు?
కవ్వించే కళ్ళ నిప్పుకణికల ముందు
నిలిచే దెవ్వరు ,?
అబల సబలై అసురుల కబళించే వేళ,
ప్రళయనాదమే మ్రోగే వేళ.

వీడు(వేడి)కోలు '

కడసారిగా నిన్ను,
కనులార చూడనీ.
కలయిక ఇక,
కలదో రాదో,,
మూసిన నా కళ్ళలో,
నీ రూపమే మోస్తున్నా .
తుది ప్రాణం నీ ఊపిరి ,,
నాదిగ చేస్తున్నా .
వీడుకోలిదే...
మరుజన్మకు వేడికోలిదే ....

మనోసంద్రం

కన్నీటి కడలికి,
తీరం నీ కళ్ళు .
ఎదురుచూపులకెదురైన
ఎండమావుల్లో
మంచు బిందువు నువ్వు.
దాహానివి నువ్వు,
విరహాల విరాగివి నువ్వు.
పయనానికి,
తొలి అడుగువి నువ్వు.
దారుల గమ్యానివి నువ్వు.
దగ్గరైన దూరానివి నువ్వు.
అడుగుల గుర్తులు
అడగక చెరిపే,
అక్కున చేరిన
తీరానివి నువ్వు.
నామనో సంద్రానివి
నువ్వు .

అల కల్లోలం

కడలి అలలు కదిలి,
తీరం తాకే వేళ,
అలజడులెన్నో,,
అగుపించని,
అల్లకల్లోల సుడులెన్నో.
ఆగి ఆగి ఆడుతున్న,
ఊపిరుల అల్పపీడనాన్ని,
అదుపుచేసే,
గుండె సడులెన్నో...

బంగారు బొమ్మ

పసిపిల్లల మనసులు
వారి చిన్ని పెదాలమీద
నవ్వులై విరుస్తాయేమో
ఇవ్వాళ క్యాంపులో
ఒకపాప ఇలా నావంకే
తదేకంగా చూస్తూ
నేనెత్తుకునే దాకా వదల్లేదు.
బాగా తెలిసినదానిలా!!
చాలాసేపు నాతోనే ఉంది.
బంగారు బొమ్మలా.
గతజన్మలోని నా అమ్మలా .

అమ్మా ,నేనూ

నేనూ నా నేనూ ..

ఏమని చెప్పను ఎంతని చెప్పను ,
ఎక్కడ మొదలెట్టనూ
మొదటి నుంచా ?
మొదటికంటే ముందు నుంచా ?
నాగురించి చెప్పేకంటే
అమ్మగురించే చెప్తేనే
నాగురించి అని చెప్పనా !
పుట్టి బుద్దెరగక ముందే
బుద్దిగా ఉండక తిన్న
అమ్మ దెబ్బలగూర్చి చెప్పనా !
పుట్టగానే నన్ను  ఎత్తుకుని 
సాయంత్రం దాకా అమ్మకివ్వని
ఆస్పత్రి ఆయాల గూర్చి చెప్పనా !
అమ్మ పెట్టే పాలబువ్వకోసం
నాకంటే ముందే వచ్చి
పాలు నేను తాగగానే అందులోని
అన్నం పిప్పి తినే పక్కింటి
లక్ష్మి గురించి చెప్పనా !
మా ఇంటి ఏకైక గేదె అమ్మకు తప్ప
ఎవరికీ పాలు పితకనీయకుంటే
ఎదురింటి సుశీలమ్మ
అమ్మచీర చుట్టుకుని పడే
అష్ట కష్టాలు చెప్పనా !
నాలుగేళ్ల వయసులో
ఒక స్టాపు ముందే ఎవరో దిగుతుంటే
అమ్మనుకుని దిగి బస్సు కదిలాక
అమ్మా అని దుమ్ములోనే
బస్సుని వెంబడించి ఆపించి
కదులుతుండగానే ఎక్కి
అమ్మనల్లుకుంది చెప్పనా !
స్కూలుకెళ్ళే దారిలో ప్రతిరోజూ
నన్నెత్తుకుని సద్ద ,జొన్న గటక
నెయి వేసి తినిపించిన
గొల్ల కొమురమ్మ గూర్చి చెప్పనా !
ఆడుతూనే స్కూలెల్లి
ఆడుతూనే ఇంటికొచ్చి
ఆడుకుంటూనే ఉన్న నన్ను
అమ్మ వెదికి పట్టి కొట్టింది చెప్పనా!

చేదబావి గిరకలన్ని చేర్చి ఒక్కచోట
పైన పీటలేసి కూర్చుని లాగుతూ
పెరడు పొక్కిలి చేసి ,నీళ్ళ కోసమోచ్చిన అమ్మలక్కల ఫిర్యాదుతో
అమ్మ నా వీపు వాయించింది చెప్పనా !
ఇంట్లో చదవట్లేదని మాస్టారుతో
అమ్మ నన్ను దండించమని చెప్తే ,
ఎలా కొట్టాలమ్మా వాడన్నింట్లో ఫస్టు
మావల్ల కాదని
( హొమ్ వర్క్ స్కూల్లో చేస్తే అమ్మకీ తెలీదు వారికీ తెలీదు ) చెప్పిన
భద్రయ్య సార్ గూర్చి చెప్పనా! ,
ఊళ్ళో రాత్రి మూడు గంటలాడిన
భాగవతాన్ని మర్నాడంతా ఆడి
అమ్మ దెబ్బలతో ముగించింది చెప్పనా !
రోజుకో బావిలో ఈత కొడుతూ
అమ్మ గుర్తు పట్టకుండా ఎంత జాగ్రత్త
పడ్డ ఎర్రని కళ్ళు చూసి ఇట్టే కనిపెట్టి
కట్టేకి పనిపెట్టిన అమ్మ గూర్చి చెప్పనా !

రోజుకో ఆటంటూ కొత్తగా కనిపెట్టి
అందర్నీ పోగేసి వాకిలంతా
ఆగం చేసింది చెప్పనా !
యాడాది కోపారి గుండు కొట్టే
మంగలి లింగయ్యకు అందకుండా
ఊరంతా తిప్పి ముప్పు తిప్పలు పెడితే
మర్నాడు అమ్మ ఎత్తుకెళ్ళి
(ఏడుస్తున్నా )
కొట్టించిన గుండు గురించి చెప్పనా !
సాయెబుల పిల్లోడికి
శివాలయంలో ఏం పనని
అందరూ మొత్తుకున్నా
మొండిగా ఊరిచివరి శివుని గుడి
మండప మెక్కి ఒంటరిగా
చదువుకున్నది చెప్పనా !
ఇసుకలో ఆడుతూ ఉన్నట్టుండి
యేరు క్షణాల్లో పొంగి
కాళ్ళు కూరుకుపోయి
నీళ్ళు పైకోస్తూ ఏడేళ్ళ నేను
ఏట్లో పడి కొట్టుకుపోతుంటే 
అప్పటికే వెదుకుతున్న అమ్మ
నన్ను చూసి ఎదురొచ్చి
లాక్కుందని చెప్పనా !
ఇంటికెళ్ళాక ఎంతగా కొట్టిందో చెప్పనా !
నేనెన్నోసార్లు బెడ్ మీంచి పడడం చూసి కింద కూడా అమ్మ ఒక దిండు
పెట్టేదని చెప్పనా ,!
అన్నీ నేనే గెల్చు కుంటానని
నాతో గోలీలాట ఎవరూ ఆడనంటే
వారికోసం కాసిన్ని ఆటలు ఒడి
తర్వాత అన్నీ గెలిచి నింపుకున్న
గోలీల బిందె నిండి
యింకా అలాగే ఊళ్ళో ఉందని చెప్పనా!
ఎన్ని దెబ్బలు కొట్టినా
అదేంటోనాకంటే అమ్మే
ఎక్కువేడ్చేదని చెప్పనా !
నాకు అమ్మంటే ప్రాణమని
చెప్పేకంటే అమ్మకే నేనంటే
ప్రాణమని చెప్పనా!

అందుకే నాప్రాణమున్నదాకా
అమ్ముంటదని చెప్పనా ,,
కాని .. ఆ దేబ్బలేవీ .!!?

సమారాధన

సమీపాన చేరినంత
సమారాధనే.
కంటి చూపు ప్రశ్నలకు
కనుల మౌనం సమాధానమే
గుండె లయలకు
మూగ శ్రుతుల,
స్వర సమ్మోహనమే.

తనువుల భాష.

తనువుల భాష,
తగిలిన గాలి,
తన చోటేదని తల్లడిల్లి,
ఒకరి శ్వాసనొకరికి శ్వాసై,
తననూ తరిమేసారని,
స్వేద బిందువుల దాగి
సేద తీర్చుకుంటుందేమో.

అమృతవర్షిణి

ఆ కౌగిలి.
ఆ స్పర్శ.
ఆ చల్లదనం.
ఆ గోరు వెచ్చదనం.
ఆ కమ్మటి వాసన
ఆ సహనం.
ఆ ఓదార్పు.
నరనరాల్నీ.
తాదాత్మ్యతనిచ్చే
ఆ వాత్సల్యం.
ఒక్కడుగు వేస్తే
పరుగెత్తుకొచ్చి.
అల్లుకునే ఆ ఆత్రం.
అడగందే అన్నం పెట్టకుండా
అమ్మా అని పిలిపించుకోవాలనే
ఆ స్వార్ధం ,
కడివెడు కన్నీటినీ
క్షణాల్లో పన్నీటిగా మార్చుకునే
ఆకంటి చూపుల వైవిధ్యం.
ఆమ్ల వర్షాన్ని సైతం
అమృత వశం చేసే
అమ్మపాశం .

తుదిసమరమ్

పరుగెడుతోన్న ఒక్కొక్షణం
ప్రాణాన్ని తరుగుతోందని
ఎలా చెప్పను?
తరుముతోన్న మృత్యువు
నీదరికి చేర్చేనని
హత్తుకున్న నీగుండె తడి తగిలి
ఎద సేదదీరేనని సంబరపడనా!
స్రవిస్తున్న రుధిరం
నీ ఆధారాల ముద్రలతో
అరుణిమయ్యెనని అల్లుకోనా?
శ్వాస బరువవుతూ
తనువు తేలికవుతూ
అణువణువూ నీలో కోల్పోతూ
తుదిసమారం ఓడిపోయి
నిన్ను గెలుచుకోనా. 

ఉగ్గుపాల జోల

పొలాలు పొక్కిలై
పల్లె పట్టుకొమ్మజారి
బతుకును ఈడ్చి
పట్నపు పోగచూరుపట్టిస్తే
అమాయక జీవితాలు
పట్టెడన్నం కరువై
కడుపునూ
కన్నకడుపునూ కట్టేసుకుని
కాళ్ళకింది భూమి
నిప్పుకణికై కాలుస్తుంటే
పాలిపోయిన మొహాన్నీ
పసి వాణ్ణీ చూసి
పని ఎవడూ ఇవ్వక
ఆకలి ఏడుపు
గుక్కలోనే పట్టి
నవ్వుతో అమ్మకు
నమ్మకాన్ని అరువిచ్చే
బుజ్జి తండ్రికి
ఉగ్గుపాల జ్ఞాపకాల
జోలపాడదామా.
అన్నమిచ్చిన
చేతులకేమీ చేయలేని
మన చేతకానితనమ్మీద
మనమే జాలిపడదామా.

తీరదూరాలు

ఎంత చేరువైనా
చేరుకోలేని
తీరాలెన్నో.
చెంతనున్నా
చెరిగిపోని
దూరాలెన్నో.
గొంతు పగిలినా
పెగలని
మిగులు ఊసులెన్నో.
క్షణాలన్నీ
దోసిట్లో పోసినా,
బరువెక్కి,
కరువైన,
కాలాలెన్నో.

నెలవంకలు

కళ్ళు తెరిచాక
మొదలైన వెదుకులాట
ఆటాపాటా దాగుడుమూతలాడి
వెలివేసిన బాల్యాన్ని ఏరుకుంటూ
మేలితిప్పే ప్రశ్నలను
పిడికిటనే పిసికేస్తూ
పసివేళ్ళు పనివేళ్ళయి
ముసిరే చీకట్లోకి
విసిరేయబడ్డ నెలవంకలు
పొగచూరిన బతుకుల్లో
పొడచూపని వెలుగులో
అక్షరదీపం వెలిగేనా 

ప్రే'మలినం

ప్రేమ
దానర్ధం ఒకప్పుడే కాదు..
ఇప్పుడైనా ఎప్పటికైనా ఒకటే అర్ధం.

ఒకప్పుడు దాన్ని ఆరాధనా, త్యాగం
అనురాగాలతో చూపించేవారు.
ప్రేమంటే ఇచ్చేదనే భావనుండేది,
ప్రేమ ఏరంగూలేనిస్వచ్చ మైనదిగా ఉండేది.
నిజానికీ ప్రేమంటే నే సంతోషాన్నిస్తూ పంచుతూ ప్రెమకొరకు ఎంతటి బాధనైనా ఓర్చుకుని
ప్రేమించినవారిని గుండెల్లో దాచుకునే
కన్నబిడ్డ వాత్సల్యమే ప్రేమంటే.

కానిపుడు,
ప్రేమకూ రంగుంది.
ప్రేమకూ ఓ రోజుంది.
ప్రేమకూ ఓ గుర్తుంది.
ప్రేమకూ ఓ పేటెంట్ ఉంది.

కాని ప్రేమే లేదు.

ఎలా ఉంటుంది?

అందాలూ ఆకర్షణలూ,
హంగూ ఆర్భాటాలూ,
పొంగూ పొగరూ,
ప్రదర్శనా పటాటోపాలూ,
పోటీలూ పోల్చుకోడాలూ,
సినిమాలూ షికార్లూ,
పబ్బులూ గబ్బులూ .
ఇంతటి మెనూ కింద నలిగి ఊపిరాడక,
ప్రేమెప్పుడో చచ్చూరుకుంటుంది.
కేవలం కాంక్షా, వాంఛా, ఆరాటం, అనుమానం,
ఈర్ష్యా, కోపాలే మనస్సులో తనువుల్లో నిండిపోయి ప్రేమంటే లాక్కునే వస్తువై,
ప్రేమంటే అణచివేతై,
ప్రేమంటే వేటై,
చేతుల్లో మారణాయుధంగానూ మారింది.

ప్రేమ రక్తసిక్తమైంది,
ప్రేమ చచ్చిపోయింది,
ప్రేమదోన్మాద పైశాచిక ప్రవృతికి
కడుపుకోతలూ కన్నీటి వెతలూ
కుటుంబాలనే కబలిస్తున్నాయి
ఈ విపరీత ధోరణులకు,
అబ్బాయిలనే పూర్తిగా నిందించలేం,
నిలదీయలెం.
తెలిసీ తెలియని వయసులో
అత్యుత్సాహాలకు పోయి 
తాత్కాలిక ఆకర్షణలకూ ఆడంబరాలకూ
మోమాటాల పరిచయాలనూ,మనసుతో ముడిపెట్టి, అమ్మాయిలూ తెలీకుండానే
అవకాశామిస్తున్నారనడంలో
ఏమాత్రం సందేహం లేదు.(కొన్ని సంఘటనల్లో)
విపరీత మనస్కులకు ఆమాత్రం అవకాశం చాలు
పెట్రేగి పోడానికి,
ప్రేమించమని,
ప్రేమించాల్సిందేననీ,
లేకుంటే చంపేసి ఇంకెవరికీ దక్కనీయని
ఉన్మాదస్థితికి చేరడానికి.
ఎంతో ఉజ్వల భవిష్యత్తుని
నిర్ణయించుకునే అమూల్యమైన కాలాన్ని
ఇలా చవగ్గా కాల్చేసి,
బతుకుల్లో బూడిదను,
కన్నవారికి కడుపుకోతనూ మిగిలిస్తున్నారు..
బతికేది బతికించేదే ప్రేమ,
చంపేదీ చచ్చేదీ ప్రేమకాదు,

అంతః కాంతి

చిక్కటి చీకటిని పారద్రోలడానికి
చిరుదీపం చాలు.
మనస్సులోని తమస్సును
మాయం చేసే అంతః కాంతి
మనలోనే ఉంది
హృదయ కావాటాలెప్పుడూ
ఉదయిస్తూనే ఉండాలి. 

పోలీస్

వీడూ మనిషే.
కాని వీడ్ని చూస్తే మనుషులకి భయం
నిజానికి తనను చూసి
తానూ కూడా భయపడతాడు.
బాధ్యతిచ్చిన ధైర్యంతో
బతుకులోని ప్రతి అడుగూ
విధిగానే వేస్తాడు .
కలలూ ఊహలూ ఆశలూ
బంధాలూ ఆప్యాయతలూ ఆహ్లాదాలూ
అన్నీ ఉంటాయి.
కాలమే ఉండదు.
టకటక ఫట్ ఫట్
ఖణేల్, ధబేల్,  డాం, శబ్దాలతో సావాసం.
ఇనుప వాసన ఖాకీ డ్రెస్సు
కర్తవ్యాన్ని రెచ్చగోడ్తూంటే
ఇంటిదేమో ఇదికావాలదికావాలని ఎచ్చవేస్తుంటే.,
తప్పనిసరై ఓసారి విసిగి, ఓసారి వేసాగి, కోపాన్నంతా దిగమింగి
పైకి చెప్పుకోక పై అధికారాల
చెప్పుచేతల్లోనూ నలిగి
నలిగిన బూట్లు కాళ్ళను,
నలిపి సలుపుతున్నా
అలుపెరుగక పరుగులతో
పురుగూ పుట్రా కొండా/ కోనా
అసలు వేటాడేది శత్రువునేనా
అనే బెరీజుకి సమయమే లేక,
సంయమనం రాక,
పొట్ట కోసం పనిచేసినా,
తనపొట్ట నెపుడూ ఖాతర్ చెయ్యక
ఖాకీ ఖదర్ ప్రాణాలిచ్చి కాపాడే,
పోలీస్ కి నా సలాం. 

దీపావళి

నరకుడింకా చావలేదు.
నరకపు వాసనింకా పోలేదు.
చీకటి చెరల్లో వెలుతురింకా
మ్రగ్గుతూనే ఉంది .
చీకటితో వెలుక్కి
ప్రతినిత్యమూ సమరమే.
ఏ చీకటీ వీడిపోదు,
మనలో అంతః జ్యోతి
వెలిగించకుంటే.
ఏ వెలుగూ దరికిరాదు,
చీకటి నెదిరించకుంటే.
చిరుదివ్వెల నరచేత ధరియించుదామ్
వెలుగురేక లందరికీ పంచుదామ్.
మనలోని నరకుణ్ణి నరికేద్దామ్
తిమిరాన్ని వ్రేళ్ళతోపెరికేద్దామ్

శుభ దీపావళి .
                       జానిపాష
                            23/10/14

రాజా రవివర్మ

చిత్రకళకు రాజయోగం పట్టించిన
మహా చిత్రకారుడు,
రాజా రవివర్మ గారి చిత్రం గీయడం,
చంద్రుడికో నూలుపోగివ్వడమే. 

తేలికైన బరువు

బంధాల లెక్కలెపుడూ,,
బాధ్యతల బరువుతోనే,
తేలికపడతాయ్. 

వీడుతున్న నీడ

ఆకాశాన్నందుకోవాలనే
అపార విజ్ఞాన సత్తువ,
భూతలాన్ని పాతాళానికి
అణగ ద్రొక్కుతున్నా,
ప్రకృతిని వికృతంగా వినియోగించి,
గాలీ వెలుతురూ బంధించి,
కాంక్రీట్ వనంలో బందీ అయిన మనిషి,
రేడియం యురేనియం నైట్రోజన్లలో,
ఆక్షీజన్ను వెదుకుతూ,
తనను తాను కోల్పోయి,
మన్నూ మిన్నూ పిడికిట్లో,
మండుతుంటే,
ఒక్కసారి వెనక్కి చూస్తే,
నీడ సైతం నిర్జీవమై,
వీడిపోతానంటుందేమో,