నేనూ నా నేనూ ..
ఏమని చెప్పను ఎంతని చెప్పను ,
ఎక్కడ మొదలెట్టనూ
మొదటి నుంచా ?
మొదటికంటే ముందు నుంచా ?
నాగురించి చెప్పేకంటే
అమ్మగురించే చెప్తేనే
నాగురించి అని చెప్పనా !
పుట్టి బుద్దెరగక ముందే
బుద్దిగా ఉండక తిన్న
అమ్మ దెబ్బలగూర్చి చెప్పనా !
పుట్టగానే నన్ను ఎత్తుకుని
సాయంత్రం దాకా అమ్మకివ్వని
ఆస్పత్రి ఆయాల గూర్చి చెప్పనా !
అమ్మ పెట్టే పాలబువ్వకోసం
నాకంటే ముందే వచ్చి
పాలు నేను తాగగానే అందులోని
అన్నం పిప్పి తినే పక్కింటి
లక్ష్మి గురించి చెప్పనా !
మా ఇంటి ఏకైక గేదె అమ్మకు తప్ప
ఎవరికీ పాలు పితకనీయకుంటే
ఎదురింటి సుశీలమ్మ
అమ్మచీర చుట్టుకుని పడే
అష్ట కష్టాలు చెప్పనా !
నాలుగేళ్ల వయసులో
ఒక స్టాపు ముందే ఎవరో దిగుతుంటే
అమ్మనుకుని దిగి బస్సు కదిలాక
అమ్మా అని దుమ్ములోనే
బస్సుని వెంబడించి ఆపించి
కదులుతుండగానే ఎక్కి
అమ్మనల్లుకుంది చెప్పనా !
స్కూలుకెళ్ళే దారిలో ప్రతిరోజూ
నన్నెత్తుకుని సద్ద ,జొన్న గటక
నెయి వేసి తినిపించిన
గొల్ల కొమురమ్మ గూర్చి చెప్పనా !
ఆడుతూనే స్కూలెల్లి
ఆడుతూనే ఇంటికొచ్చి
ఆడుకుంటూనే ఉన్న నన్ను
అమ్మ వెదికి పట్టి కొట్టింది చెప్పనా!
చేదబావి గిరకలన్ని చేర్చి ఒక్కచోట
పైన పీటలేసి కూర్చుని లాగుతూ
పెరడు పొక్కిలి చేసి ,నీళ్ళ కోసమోచ్చిన అమ్మలక్కల ఫిర్యాదుతో
అమ్మ నా వీపు వాయించింది చెప్పనా !
ఇంట్లో చదవట్లేదని మాస్టారుతో
అమ్మ నన్ను దండించమని చెప్తే ,
ఎలా కొట్టాలమ్మా వాడన్నింట్లో ఫస్టు
మావల్ల కాదని
( హొమ్ వర్క్ స్కూల్లో చేస్తే అమ్మకీ తెలీదు వారికీ తెలీదు ) చెప్పిన
భద్రయ్య సార్ గూర్చి చెప్పనా! ,
ఊళ్ళో రాత్రి మూడు గంటలాడిన
భాగవతాన్ని మర్నాడంతా ఆడి
అమ్మ దెబ్బలతో ముగించింది చెప్పనా !
రోజుకో బావిలో ఈత కొడుతూ
అమ్మ గుర్తు పట్టకుండా ఎంత జాగ్రత్త
పడ్డ ఎర్రని కళ్ళు చూసి ఇట్టే కనిపెట్టి
కట్టేకి పనిపెట్టిన అమ్మ గూర్చి చెప్పనా !
రోజుకో ఆటంటూ కొత్తగా కనిపెట్టి
అందర్నీ పోగేసి వాకిలంతా
ఆగం చేసింది చెప్పనా !
యాడాది కోపారి గుండు కొట్టే
మంగలి లింగయ్యకు అందకుండా
ఊరంతా తిప్పి ముప్పు తిప్పలు పెడితే
మర్నాడు అమ్మ ఎత్తుకెళ్ళి
(ఏడుస్తున్నా )
కొట్టించిన గుండు గురించి చెప్పనా !
సాయెబుల పిల్లోడికి
శివాలయంలో ఏం పనని
అందరూ మొత్తుకున్నా
మొండిగా ఊరిచివరి శివుని గుడి
మండప మెక్కి ఒంటరిగా
చదువుకున్నది చెప్పనా !
ఇసుకలో ఆడుతూ ఉన్నట్టుండి
యేరు క్షణాల్లో పొంగి
కాళ్ళు కూరుకుపోయి
నీళ్ళు పైకోస్తూ ఏడేళ్ళ నేను
ఏట్లో పడి కొట్టుకుపోతుంటే
అప్పటికే వెదుకుతున్న అమ్మ
నన్ను చూసి ఎదురొచ్చి
లాక్కుందని చెప్పనా !
ఇంటికెళ్ళాక ఎంతగా కొట్టిందో చెప్పనా !
నేనెన్నోసార్లు బెడ్ మీంచి పడడం చూసి కింద కూడా అమ్మ ఒక దిండు
పెట్టేదని చెప్పనా ,!
అన్నీ నేనే గెల్చు కుంటానని
నాతో గోలీలాట ఎవరూ ఆడనంటే
వారికోసం కాసిన్ని ఆటలు ఒడి
తర్వాత అన్నీ గెలిచి నింపుకున్న
గోలీల బిందె నిండి
యింకా అలాగే ఊళ్ళో ఉందని చెప్పనా!
ఎన్ని దెబ్బలు కొట్టినా
అదేంటోనాకంటే అమ్మే
ఎక్కువేడ్చేదని చెప్పనా !
నాకు అమ్మంటే ప్రాణమని
చెప్పేకంటే అమ్మకే నేనంటే
ప్రాణమని చెప్పనా!
అందుకే నాప్రాణమున్నదాకా
అమ్ముంటదని చెప్పనా ,,
కాని .. ఆ దేబ్బలేవీ .!!?
No comments:
Post a Comment