Monday 3 November 2014

గురుతు జాడ

గుండె పంచుకుని
గురుతులు పెంచుకుని
కాలపు గాయాలకు
కలల అల్లికలు కల్లోలమై
కలిసి నడచిన
అడుగుల జాడ
బదులడిగితే
మనసు మౌనమై
మాట శూన్యమై
చూపు పరావర్తనమై
ఎదురు తిరిగితే
కనుచూపు మేరలో
నిను గాంచగలనా?

Saturday 1 November 2014

నిత్యవిద్యార్ది.

కొడిగట్టే కొనచూపుల
వాడి వాలుచూపుల
కోటి ప్రశ్నల అన్వస్త్రాలు
కాలాన్ని కలచి ఛిద్రం చేస్తుంటే
ముడతల ముగ్ధ మూర్తీభవించిన మోములో మడిచిన
నిరీక్షణాలసటలెన్నొ
కదిలే జీవిత గ్రంధాలయమై
శ్వేతపత్రాల శేష పుటల కొరకు
సేకరించే నిత్య విద్యార్ధి.

భయానికి ఆవల.

అసహాయతలోని పరాకాష్ట,
అంతర్భయాన్ని,
ఆమడదూరం పారద్రోలుతుంది.
ఊపిరి బిగబట్టిన ప్రతిక్షణం,
ఉత్తుంగ తరంగమై
ధైర్యాన్ని ఉసిగొల్పుతుంది.
పరిసరాలు ఘనీభవించి
పరిణామాన్ని ఆస్వాదిస్తాయ్.
నిజమే.......
భయానికి ఆవల ఉండేది,,,
విజయమే.
దాటాల్సింది లిప్తకాలపు.
పరిధి మాత్రమే.

Thursday 30 October 2014

నింగీ నేలా నీదే .

నింగీ నేలా నీదే .
*************
అంతులేని అంతః శక్తి నీది
అదుపులేని ఆత్మ నిగ్రహం నీది.
అందమైన విగ్రహం నీది
ఆత్మీయాగ్రహం నీది.
అమ్మంటి అనుగ్రహం నీది.
సాగరాన్ని మించిన అనురాగం నీది. ఆకసమంటిన ఆత్మవిశ్వాసం నీది.
పంచభూతాలు నింపుకున్న
పరాశక్తివి నీవు.
ప్రెమనిధివి నీవు.
మమతల పెన్నిధివి నీవు.
జగతికి గతివి నీవు.
ప్రగతికి పరమావధివి నీవు.
నింగీ నేలా నీదే.
జవమూ జీవమూ నీదే.
ఉవ్వెత్తున ఎగిసిపో.
నీ ఉనికి నీడన
ఉజ్వల లోకాన్ని అల్లుకో.

Tuesday 28 October 2014

అంతర్ముఖం

ప్రతి ముఖాన దాగి మరోముఖం
అస్తిత్వాన్ని సవాల్ చేస్తూనే ఉంటుంది
అంతర్మధనం కదనం చేస్తూ
కవాతు చేస్తూనే ఉంటుంది
పరుగులబడి బాహ్యరూపం
అరువు పరువుకై అర్రులు చాస్తూ
అలమటిస్తూనే ఉంటుంది
అంతులేని అంతర్యుద్ధమిది.
మరో మలుపుకై అలుపులేని
మనో కలుపుతీత ఇది. 

Saturday 25 October 2014

స్థిత ప్రజ్ఞత

దేహం అశాశ్వతమే.
స్తిత్వానికి అదృశ్య ఊహలకీ
ఆశలకీ దృశ్య రూపమున్నందుకే
ఇన్ని ఉపసద్రుశ్యాలూఉపస్తితులూ.
నిరాశా నిస్పృహల
సశేష అవశేషాలనుండి
తిరిగి కోలుకుని కోల్పోయిన
క్షణాల కాలాన్ని
జీవితాంతం అనిపించేలా
పునః ప్రతిష్టించడం.
అతిధే అయినా అణువణువూ తనువణువూ తనదై
కాలాన్ని కొలిచే ప్రామాణికం.
దేహసందేహాలన్నీ సందేశాలే.
కొలువైన జీవాన్నీ సెలవంటూ
సేద తీరే వేళ,
మౌన సాక్షిగా నిలిచే స్థిత ప్రాజ్ఞ్యి దేహం.

మంచిరోజు

మంచి రోజు ఏ ఆకాశాన్నుంచో ఊడిపడదుగా
ఎదురు చూడ్డానికి .....,!!!
పితృస్వామ్య వ్యవస్థ మనది....
మగవాడికి ఆడదాని అవసరం అడుగడుగునా ఉన్నప్పటికీ సంపాదిస్తున్నామనే అహం, పోషిస్తున్నామనే అధికారం, ,వాటికి తోడు అనాదిగా కొనసాగుతున్న ఆచారాలూ, పురుషుని వైపే మొగ్గు చూపేవిగా ఉండడంతో,
మళ్ళీ బలయ్యేది ఆడదే .,,,,,,,
సహనాన్ని బలహీనతగా చూసే సమాజం,
దాన్నే ఆడదానికుండాల్సిన లక్షణమని తేల్చి పారేసింది. .ఆడది తనకు తాను అణచివేతను
ఆహ్వానించేలా చేసిందీ సమాజమే .చివరకెటోచ్చీ
ఆడది అనే పదార్ధం ఆధారపడి బ్రతకడానికే అన్నట్లుగా ,ఆడపిల్ల పుడితే పురిట్లోనే పూడ్చేలా
తయారయిందీ సమాజం ......
ఎప్పుడయితే ఆడది ఆధారపడి బ్రతికే స్థాయి నుండి
ఆర్ధిక ,విద్యా ఉద్యోగ స్వావలంబన పొంది..... మానసికంగానే కాకుండా భౌతికంగానూ శక్తినొందితే. త్వరలో కాకున్నా తెరలు తెరలుగానైనా...
ఈ ఆచారాల అణచివేతల నుండి విముక్తి పొందొచ్చు. .ఆరోజు కోసం ఎదురు చూడడం కాదు..
అలాటి రోజును  నిర్మించడానికి ......
ఈరోజే పునాది వెయ్యాలి .....
అమ్మ గురించి గొప్పలు చెప్పి చెప్పి.......
గొప్పలు పోవడం కాదు .....
ఆడతనం లేనిదే అమ్మతనం రాదు....
ఆడదాన్ని గౌరవిస్తే అమ్మనీ గౌరవించినట్లే....