Saturday, 25 October 2014

దీవించే జీవులు

పుట్టి పెరిగే  మొదలు చదివిఎదిగేదాక కన్నవారు కాయాన్ని
కష్టాలు పాల్జేసి చేతికందొస్తాడని చిల్లిగవ్వను దాచక పస్తులుండి
తల్లి  పుస్తెలమ్మి ..
బస్తీ నుండి వచ్చి దర్జాగ కారులో వొదిలేస్తే మమ్మల్ని వోల్డేజి హోములో .
చేతులేన్నడూ దీవించేవే కాని
గోరంత కోపాన్ని చూపవేనాడూ .
కనుచూపు మేర కనిపించునత
కన్న కొడుకుని చూసి కళ్ళ నిండా .
చల్లంగ ఉండాలి కొడుకా నువ్వు
మెల్లంగ వెళ్లురా కొడుకా .



స్నేహస్తాలు

అరమరికల్లేని హృదయాల అమరిక,
హద్దూ అదుపూ లేని అలల వీచిక,
స్నేహాల లయల ఊయల డోలలో
ఊగెనే జగమంత ఉల్లాస హేలలో,
నీదీ నాదీయనే నియమమే లేనిదీ,
మనదే మనమే అనే మమతే ఉన్నదీ, తోడబుట్టిన వారి తోడూ కరవైనా,
చెలిమి చేసిన చేయి వీడదెపుడైనా
అందుకే ఓ నేస్తం,
అందుకో స్నేహహస్తం.
స్నేహమయమే జగం సమస్తం .

నిప్పు పిడికిళి

ఉడుకెత్తిన ఉక్కుపిడికిళ్ల
మెరుపు రవ్వలనాపేదెవ్వరు?
కవ్వించే కళ్ళ నిప్పుకణికల ముందు
నిలిచే దెవ్వరు ,?
అబల సబలై అసురుల కబళించే వేళ,
ప్రళయనాదమే మ్రోగే వేళ.

వీడు(వేడి)కోలు '

కడసారిగా నిన్ను,
కనులార చూడనీ.
కలయిక ఇక,
కలదో రాదో,,
మూసిన నా కళ్ళలో,
నీ రూపమే మోస్తున్నా .
తుది ప్రాణం నీ ఊపిరి ,,
నాదిగ చేస్తున్నా .
వీడుకోలిదే...
మరుజన్మకు వేడికోలిదే ....

మనోసంద్రం

కన్నీటి కడలికి,
తీరం నీ కళ్ళు .
ఎదురుచూపులకెదురైన
ఎండమావుల్లో
మంచు బిందువు నువ్వు.
దాహానివి నువ్వు,
విరహాల విరాగివి నువ్వు.
పయనానికి,
తొలి అడుగువి నువ్వు.
దారుల గమ్యానివి నువ్వు.
దగ్గరైన దూరానివి నువ్వు.
అడుగుల గుర్తులు
అడగక చెరిపే,
అక్కున చేరిన
తీరానివి నువ్వు.
నామనో సంద్రానివి
నువ్వు .

అల కల్లోలం

కడలి అలలు కదిలి,
తీరం తాకే వేళ,
అలజడులెన్నో,,
అగుపించని,
అల్లకల్లోల సుడులెన్నో.
ఆగి ఆగి ఆడుతున్న,
ఊపిరుల అల్పపీడనాన్ని,
అదుపుచేసే,
గుండె సడులెన్నో...

బంగారు బొమ్మ

పసిపిల్లల మనసులు
వారి చిన్ని పెదాలమీద
నవ్వులై విరుస్తాయేమో
ఇవ్వాళ క్యాంపులో
ఒకపాప ఇలా నావంకే
తదేకంగా చూస్తూ
నేనెత్తుకునే దాకా వదల్లేదు.
బాగా తెలిసినదానిలా!!
చాలాసేపు నాతోనే ఉంది.
బంగారు బొమ్మలా.
గతజన్మలోని నా అమ్మలా .