వీడూ మనిషే.
కాని వీడ్ని చూస్తే మనుషులకి భయం
నిజానికి తనను చూసి
తానూ కూడా భయపడతాడు.
బాధ్యతిచ్చిన ధైర్యంతో
బతుకులోని ప్రతి అడుగూ
విధిగానే వేస్తాడు .
కలలూ ఊహలూ ఆశలూ
బంధాలూ ఆప్యాయతలూ ఆహ్లాదాలూ
అన్నీ ఉంటాయి.
కాలమే ఉండదు.
టకటక ఫట్ ఫట్
ఖణేల్, ధబేల్, డాం, శబ్దాలతో సావాసం.
ఇనుప వాసన ఖాకీ డ్రెస్సు
కర్తవ్యాన్ని రెచ్చగోడ్తూంటే
ఇంటిదేమో ఇదికావాలదికావాలని ఎచ్చవేస్తుంటే.,
తప్పనిసరై ఓసారి విసిగి, ఓసారి వేసాగి, కోపాన్నంతా దిగమింగి
పైకి చెప్పుకోక పై అధికారాల
చెప్పుచేతల్లోనూ నలిగి
నలిగిన బూట్లు కాళ్ళను,
నలిపి సలుపుతున్నా
అలుపెరుగక పరుగులతో
పురుగూ పుట్రా కొండా/ కోనా
అసలు వేటాడేది శత్రువునేనా
అనే బెరీజుకి సమయమే లేక,
సంయమనం రాక,
పొట్ట కోసం పనిచేసినా,
తనపొట్ట నెపుడూ ఖాతర్ చెయ్యక
ఖాకీ ఖదర్ ప్రాణాలిచ్చి కాపాడే,
పోలీస్ కి నా సలాం.
Saturday, 25 October 2014
పోలీస్
దీపావళి
నరకుడింకా చావలేదు.
నరకపు వాసనింకా పోలేదు.
చీకటి చెరల్లో వెలుతురింకా
మ్రగ్గుతూనే ఉంది .
చీకటితో వెలుక్కి
ప్రతినిత్యమూ సమరమే.
ఏ చీకటీ వీడిపోదు,
మనలో అంతః జ్యోతి
వెలిగించకుంటే.
ఏ వెలుగూ దరికిరాదు,
చీకటి నెదిరించకుంటే.
చిరుదివ్వెల నరచేత ధరియించుదామ్
వెలుగురేక లందరికీ పంచుదామ్.
మనలోని నరకుణ్ణి నరికేద్దామ్
తిమిరాన్ని వ్రేళ్ళతోపెరికేద్దామ్
శుభ దీపావళి .
జానిపాష
23/10/14
రాజా రవివర్మ
చిత్రకళకు రాజయోగం పట్టించిన
మహా చిత్రకారుడు,
రాజా రవివర్మ గారి చిత్రం గీయడం,
చంద్రుడికో నూలుపోగివ్వడమే.
వీడుతున్న నీడ
ఆకాశాన్నందుకోవాలనే
అపార విజ్ఞాన సత్తువ,
భూతలాన్ని పాతాళానికి
అణగ ద్రొక్కుతున్నా,
ప్రకృతిని వికృతంగా వినియోగించి,
గాలీ వెలుతురూ బంధించి,
కాంక్రీట్ వనంలో బందీ అయిన మనిషి,
రేడియం యురేనియం నైట్రోజన్లలో,
ఆక్షీజన్ను వెదుకుతూ,
తనను తాను కోల్పోయి,
మన్నూ మిన్నూ పిడికిట్లో,
మండుతుంటే,
ఒక్కసారి వెనక్కి చూస్తే,
నీడ సైతం నిర్జీవమై,
వీడిపోతానంటుందేమో,
Sunday, 15 June 2014
ఇరు చూపులు
ఊహలకి ఊపిరి పోస్తూ,
ఊసులలో ఊగిసలాడుతూ,
కళ్ళల్లో కదలాడే కలలను
చూపులతో తాకుతూ, త్రాగుతూ,,
మరపురాని మైమరుపులో
గుండెల్లో గురుతుల్ని
శాశ్వతంగా చెక్కుతూ
ఊహలు గుసగుసలాడే
ఊపిరి తొణికి సలాడే.
Monday, 2 June 2014
రేరేడు .
అదిగదిగో జాబిల్లి
అటుచూడు,
అటుచూడు.
నల్లనీ చీకట్లో
తెల్లనీ రేరేడు.
కారుమబ్బుల దాగి,
కాసేపు కనరాడు.
దోబూచులాడెను,
దోర వన్నెల్లో.
అలసిపోయాడేమొ,
అల్లన మేఘాల్లో,.
సొలసి ఒదిగాడేమొ,
నిదురమ్మ వొళ్ళో.