Saturday, 25 October 2014

సమారాధన

సమీపాన చేరినంత
సమారాధనే.
కంటి చూపు ప్రశ్నలకు
కనుల మౌనం సమాధానమే
గుండె లయలకు
మూగ శ్రుతుల,
స్వర సమ్మోహనమే.

తనువుల భాష.

తనువుల భాష,
తగిలిన గాలి,
తన చోటేదని తల్లడిల్లి,
ఒకరి శ్వాసనొకరికి శ్వాసై,
తననూ తరిమేసారని,
స్వేద బిందువుల దాగి
సేద తీర్చుకుంటుందేమో.

అమృతవర్షిణి

ఆ కౌగిలి.
ఆ స్పర్శ.
ఆ చల్లదనం.
ఆ గోరు వెచ్చదనం.
ఆ కమ్మటి వాసన
ఆ సహనం.
ఆ ఓదార్పు.
నరనరాల్నీ.
తాదాత్మ్యతనిచ్చే
ఆ వాత్సల్యం.
ఒక్కడుగు వేస్తే
పరుగెత్తుకొచ్చి.
అల్లుకునే ఆ ఆత్రం.
అడగందే అన్నం పెట్టకుండా
అమ్మా అని పిలిపించుకోవాలనే
ఆ స్వార్ధం ,
కడివెడు కన్నీటినీ
క్షణాల్లో పన్నీటిగా మార్చుకునే
ఆకంటి చూపుల వైవిధ్యం.
ఆమ్ల వర్షాన్ని సైతం
అమృత వశం చేసే
అమ్మపాశం .

తుదిసమరమ్

పరుగెడుతోన్న ఒక్కొక్షణం
ప్రాణాన్ని తరుగుతోందని
ఎలా చెప్పను?
తరుముతోన్న మృత్యువు
నీదరికి చేర్చేనని
హత్తుకున్న నీగుండె తడి తగిలి
ఎద సేదదీరేనని సంబరపడనా!
స్రవిస్తున్న రుధిరం
నీ ఆధారాల ముద్రలతో
అరుణిమయ్యెనని అల్లుకోనా?
శ్వాస బరువవుతూ
తనువు తేలికవుతూ
అణువణువూ నీలో కోల్పోతూ
తుదిసమారం ఓడిపోయి
నిన్ను గెలుచుకోనా. 

ఉగ్గుపాల జోల

పొలాలు పొక్కిలై
పల్లె పట్టుకొమ్మజారి
బతుకును ఈడ్చి
పట్నపు పోగచూరుపట్టిస్తే
అమాయక జీవితాలు
పట్టెడన్నం కరువై
కడుపునూ
కన్నకడుపునూ కట్టేసుకుని
కాళ్ళకింది భూమి
నిప్పుకణికై కాలుస్తుంటే
పాలిపోయిన మొహాన్నీ
పసి వాణ్ణీ చూసి
పని ఎవడూ ఇవ్వక
ఆకలి ఏడుపు
గుక్కలోనే పట్టి
నవ్వుతో అమ్మకు
నమ్మకాన్ని అరువిచ్చే
బుజ్జి తండ్రికి
ఉగ్గుపాల జ్ఞాపకాల
జోలపాడదామా.
అన్నమిచ్చిన
చేతులకేమీ చేయలేని
మన చేతకానితనమ్మీద
మనమే జాలిపడదామా.

తీరదూరాలు

ఎంత చేరువైనా
చేరుకోలేని
తీరాలెన్నో.
చెంతనున్నా
చెరిగిపోని
దూరాలెన్నో.
గొంతు పగిలినా
పెగలని
మిగులు ఊసులెన్నో.
క్షణాలన్నీ
దోసిట్లో పోసినా,
బరువెక్కి,
కరువైన,
కాలాలెన్నో.

నెలవంకలు

కళ్ళు తెరిచాక
మొదలైన వెదుకులాట
ఆటాపాటా దాగుడుమూతలాడి
వెలివేసిన బాల్యాన్ని ఏరుకుంటూ
మేలితిప్పే ప్రశ్నలను
పిడికిటనే పిసికేస్తూ
పసివేళ్ళు పనివేళ్ళయి
ముసిరే చీకట్లోకి
విసిరేయబడ్డ నెలవంకలు
పొగచూరిన బతుకుల్లో
పొడచూపని వెలుగులో
అక్షరదీపం వెలిగేనా